పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. హరీష్ కి పూజా హెగ్డే సెంటిమెంట్ గా మారింది. డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో పూజానే కథానాయిక. ఈ రెండు సినిమాలూ హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాలోనూ పూజాకి చోటిచ్చాడు. పవన్ - పూజాల కాంబో సెట్టవ్వడం ఇదే తొలిసారి. కాబట్టి కాంబినేషన్ పరంగానూ ఈ సినిమాకి క్రేజ్‌వస్తుందని నిర్మాతలు భావించారు.
కాకపోతే పూజా ఎంపికనే.. ఈసినిమాకి తలనొప్పిగా మారింది. పూజా డేట్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. తన కాల్షీట్లు ఖరారైతే గానీ, షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఓ క్లారిటీ లేదు. `ఈ సినిమాలో నేను నటిస్తాను కానీ, డేట్లు ఇవ్వడం కష్టం` అని పూజా ముందుగానే చెప్పిందట. ఇప్పుడు పూజా డేట్లు ఇస్తే గానీ, పవన్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. నిజానికి దసరాకి ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం వాయిదా పడింది. పూజా డేట్లు ఎప్పుడో తెలిస్తే.. అప్పుడే ఈ సినిమాని మొదలెడతార్ట.