ఈమధ్య ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా... పాన్ ఇండియా అనే మాటే వినిపిస్తోంది. పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా సినిమా... అనే మాటలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లో అగ్ర హీరోలంతా పాన్ ఇండియా స్టార్లే. మరి పాన్ ఇండియా హీరోయిన్ ఎవరు? అని అడిగితే, పూజా హెగ్డే పేరే చెప్పాలేమో..?
అవును.. పూజా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తాను చేసిన రాధేశ్యామ్ ఓ పాన్ ఇండియా సినిమా. అంతకు ముందే బాలీవుడ్‌లో పూజా అందరికీ తెలుసు. రాధే శ్యామ్‌తో తన ముద్ర ఇంకాస్త బలంగా వేయబోతోంది. తమిళంలో ఓ సినిమా చేస్తోంది పూజా. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ యేడాదే విడుదల కానుంది. రణవీర్ సింగ్ తో ఓ హిందీ సినిమా చేసింది. ఇక తెలుగులో అత్యంత బిజీగా ఉండే హీరోయిన్ పూజానే. పాన్ ఇండియా సినిమా తయారవుతోంటే, ముందుగా పూజా పేరే వినిపిస్తోందట. అన్ని భాషల్లోనూ పూజా తెలుసు కాబట్టి, తనని హీరోయిన్ గా ఎంచుకుంటే, బిజినెస్ పరంగా బాగుంటుందన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే పూజా ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. అలా... పూజా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.