నెంబర్ వన్ సినిమా గుర్తుంది కదా? కృష్ణ, సౌందర్య జంటగా నటించారు. ఇందులో పాటలన్నీ హిట్టే. దాంతో పాటు విలనిజం కూడా. శాడిస్ట్ విలన్గా... బ్రహ్మానందాన్ని ముప్పు తిప్పలు పెట్టిన మహేష్ ఆనంద్ ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరవాత టాప్ హీరో, బాలు తదితర చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు.
ఆ మహేష్ ఆనంద్ ముంబైలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. బాలీవుడ్ హిట్ చిత్రాలలో వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకున్న మహేష్ ఆనంద్... శనివారం ముంబైలోని తన స్వగృహంలో శవమై కనిపించారు. ఆయన మరణించి రెండు రోజులైందని పోలీసులు నిర్దారించారు. శవాన్ని గుర్తించేలోగా.. కుళ్లిపోయి చెడువాసన కూడా వస్తోందట.
మహేష్ ది ఆత్మహత్యా? లేదంటే హత్యా? లేదంటే గుండెపోటుతో సహజ మరణం పాలయ్యారా? అనేది నిర్దారించాల్సివుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారని, ఒంటరితనం భరించలేక.. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ.. ఇంట్లో సూసైడ్ నోట్ లాంటివేం లభించలేదు.