దర్శకుడిగా కొరటాల శివ సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కొరటాల. అయితే.. ఆయనపై కొన్ని విమర్శలు, ఆయన కథలపై కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆయన కథలపై కాపీ ముద్రలు పడ్డాయి. `ఆచార్య కథ నాదే..` అంటూ ఓ యువ దర్శకుడు మీడియా ముందుకు రావడం తెలిసిన విషయమే. `శ్రీమంతుడు` పైనా కొన్ని వివాదాలున్నాయి. అయితే ఈ విషయంలో కొరటాలను వెనకేసుకొచ్చారు సీరియర్ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి. ``కొరటాల కథలు కొట్టేసే రకం కాదు.
తన దగ్గరే బోలెడు కథలున్నాయి. తన కథలు తానే, తానొక్కడే రాసుకుంటాడు. తన కథలే కొంతమంది కొట్టేశారు. తప్పు ఒప్పుకుని, క్షమాపణ చెప్పి, నష్టపరిహారం కూడా ఇచ్చారు`` అని క్లారిటీగా చెప్పేశాడు. ఆ దర్శకుడు బోయపాటి శ్రీనునే అని ఇండ్రస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. `సింహా` సినిమాకి బోయపాటితో పాటు కొరటాల పనిచేశాడని, ఆ సమయంలో తన కథని బోయపాటి కాపీ కొట్టాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం నడిచిందని అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు పోసాని కూడా దాన్నే గుర్తు చేశాడని టాక్.