దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకి కన్నీటి వీడ్కోలు పలికింది అఖిల భారతం. తన అమృత గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించిన గాన గంధర్వుడి అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం పూర్తయ్యాయి. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకు ముందు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు.
తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అయితే... వారందరికీ లోపలకి అనుమతులు లభించలేదు. బాలు బంధువులు, సన్నిహితులు చాలామంది గేటు బయటే ఉండిపోవాల్సివచ్చింది.