దశాబ్దాల పాటు సాగిన బాలు ప్రయాణంలో అందుకోని అవార్డు లేదు. ఎక్కని శిఖరం లేదు. జాతీయ, నంది అవార్డులు బాలు పాదాక్రాంత మయ్యాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కాలు వరించాయి. ఫిల్మ్‌ఫేర్, ప్రైవేటు అవార్డులకైతే లెక్కేలేదు. అయితే... బాలు భారత రత్నకు అన్నివిధాలా అర్హుడన్నది ఆయన అభిమానుల మాట. అన్ని భాషల్లోనూ, పాటలు పాడి, అభిమానుల్ని సంపాదించుకుని, చిత్రరంగానికే కాదు, సంగీత ప్రపంచానికీ ఆయన ఎనలేని సేవ చేశారు. అందుకే బాలుకి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. బాలుకి భారతరత్న ఇవ్వాలని ప్రముఖ కథానాయకుడు అర్జున్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారిప్పుడు.
ఓ గాయకుడి కెరీర్‌లో బాలూలా 45 వేల పాటలు పాడడం అసాధ్యమని, అందుకు ఎవరైనా సరే, రెండు జన్మలెత్తాలని, బాలు మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. అన్ని భాషల్లోనూ ఇంత సంగీత సేవ చేసిన వ్యక్తి బాలూ మాత్రమే అని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని, అందుకోసం దక్షిణాది చిత్రసీమ మొత్తం ఒకేసారి గొంతెత్తాలని పిలుపు నిచ్చారు. దక్షిణాది తలచుకుంటే.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు. కథానాయకులంతా మద్దతు తెలిపితే... ఈ కోరికని కేంద్రం పరిశీలించొచ్చు. బాలుకి భారతరత్న వరిస్తే.. అంతకంటే కావల్సిందేముంది?