పవన్ కల్యాణ్‌పై వీరలెవిల్లో విరుచుకుపడిన పోసానికృష్ణ మురళి ఇప్పుడు తెలుగు మీడియాని తన వైపుకు తిప్పుకున్నాడు. ఓరకంగా... పవన్ పై పోసాని తీవ్రమైన విమర్శలు చేసినట్టే. పవన్ కి నిజాయతీ లేదని, సిగ్గులేదని, ఇంగిత జ్ఞానం లేదని - ఇలా చాలా చాలా తీవ్రంగా కామెంట్లు చేశాడు. ఇందులో పవన్ పారితోషికం ప్రస్తావన కూడా వచ్చింది. పవన్ తాను పది కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు చెప్పాడని, అయితే పవన్ పారితోషికం ఒక్కో సినిమాకీ 50 కోట్లని, ఇది తప్పని నిరూపిస్తే చెంపదెబ్బలకు సైతం సిద్ధమని, పవన్ కి ఒక్కో సినిమాకీ తాను 15 కోట్ల పారితోషికం ఇస్తానని, నాలుగు సినిమాలు చేయడానికి తనతో ఎగ్రిమెంట్ కి సిద్ధమా? అంటూ... పోసాని చాలా రకాల లాజిక్కులు తీశాడు.
నిజానికి పవన్ తన పారితోషికం పది కోట్లని ఎక్కడా చెప్పలేదు. 'పది కోట్లు తీసుకుంటే మూడున్నర కోట్లు టాక్స్ కడతాం' అనే పవన్ చెప్పాడు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అది స్పష్టంగా వినిపించింది కూడా. అయితే పోసాని ఎందుకంత కన్‌ఫ్యూజ్ అయ్యాడో తెలీదు. ఇదే విషయమై పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు పోసానిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఒక వేళ పవన్ పారితోషికం పది కోట్లే అనుకుందాం. అయినా సరే, పోసాని 15 కోట్లు ఇస్తే తానెందుకు పోసానికి సినిమా చేయాలి? సినిమా చేయాలా? వద్దా? అనేది పారితోషికం బట్టి డిసైడ్ అవ్వదు. సినిమా ఒప్పుకునే విషయంలో ఒకొక్కరిదీ ఒక్కో థియరీ. పారితోషికం ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఎవరికి పడితే వాళ్లకు స్టార్లు డేట్లు ఇవ్వరు కదా? చిత్రసీమలో ఇన్నేళ్లుగా ఉన్న పోసాని ఈ మాత్రం చిన్న లాజిక్ ని ఎలా తప్పాడో? మొత్తానికి మిగిలిన విమర్శల మాటెలా ఉన్నా, పారితోషికం విషయంలో మాత్రం పోసాని లెక్క తప్పింది.