ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనుంది. కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొణెని ఎంచుకున్నారు. ఆమెకు దాదాపు 30 కోట్ల వరకూ పారితోషికం ఇచ్చారని బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ లైన్ కూడా లీకైంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ కథ ఉండబోతోందట. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? అనే ఆలోచననుంచి ఈ కథ పుట్టుకొచ్చిందట.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని, జానపద కథ అని, సోషియో ఫాంటసీ అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు యుద్ధ కథ అంటున్నారు. అయినా ప్రభాస్‌కి యుద్ధాలు కొత్త కాదు. బాహుబలిలో.. కత్తిపట్టి యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆధునిక ఆయుధాలు చేతికి వస్తాయేమో? అయితే.. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే నాగ అశ్విన్ నోరు విప్పాల్సిందే.