స్టార్ హీరోల్లో ఓ మోస్తరు స్టార్‌గా చెలామణీ అవుతోన్న ప్రబాస్, 'బాహుబలి'తో ఒక్కసారిగా, ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనేది అర్ధం కాని అగమ్మగోచర స్థితికి వెళ్లిపోయాడు. అదే తరుణంలో 'సాహో' అతని తలుపు తట్టింది. నిజానికి 'సాహో' ఎప్పుడో తెరకెక్కాల్సిన సినిమా. 'బాహుబలి' కారణంగా డైరెక్టర్ సుజిత్, కథతో దాదాపు నాలుగేళ్లు ప్రబాస్ కోసం వెయిట్ చేశాడు. 'బాహుబలి' తర్వాత అమాంతం పెరిగిపోయిన ప్రబాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగా, కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి, 'సాహో'గా తెరకెక్కించాడు.
'సాహో'పై ఉన్న అంచనాలు, బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో మరోసారి ప్రబాస్ ప్రభంజనం సృష్టించేయడం ఖాయమనిపిస్తోంది. కానీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం తనది అంటున్నాడు. ఈ వ్యక్తిత్వం, మెగాస్టార్ చిరంజీవి నుండే నేర్చుకున్నానని ప్రబాస్ మీడియా ముఖంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాడు. చిరంజీవితో పాటు, రాజమౌళి వంటి గ్రేట్ డైరెక్టర్స్ నుండి ఈ ఒద్దిక మనస్తత్వం తనకు అలవడిందనీ, అదే పద్ధతిని ఎప్పటికీ తాను పాఠిస్తానని అంటున్నాడు.
ఈ రకమైన వ్యక్తిత్వం కారణంగా, సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి జీవితంపై పెద్దగా ప్రభావితం చూపలేవనీ నాకున్న ఈ కొద్దిపాటి అనుభవంతో ఖచ్చితంగా చెప్పగలనని డార్లింగ్ చెప్పుకొచ్చాడు. ప్రబాస్ నటించిన 'సాహో' ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది.