పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలు కూడా ఈ మధ్య మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇది మంచి పరిణామం అంటున్నాడు ప్రబాస్. 'సాహో' ప్రమోషన్స్‌లో భాగంగా, ప్రభాస్ పలు ఆసక్తికరమైన విషయాలు ముచ్చటిస్తున్నాడు. ఈ మధ్య 'ఆర్ ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి' వంటి చిత్రాలు సంచలన విజయాలు అందుకుంటున్నాయి.
చిన్న సినిమాలను ప్రోత్సహిస్తే, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించినట్లే. కొత్తదనం కోరుకుంటున్న ఆడియన్స్‌కి, సినీ పరిశ్రమ ఇచ్చే బహుమానమిది. చిన్న సినిమాలు హిట్ అయితేనే, కొత్త కొత్త దర్శకులు, కొత్త కొత్త కథలతో ముందుకొస్తారు. చిన్న హీరోలే కాదు, స్టార్ హీరోలు కూడా, కొత్త దర్శకులతో పని చేసేందుకు ఇష్టపడుతున్న రోజులివి. అలాంటి యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తే, మన సినీ పరిశ్రమ పది కాలాలు పచ్చగా ఉంటుంది అని ప్రభాస్ స్పందించాడు. అలాగే పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలైన 'అర్జున్‌రెడ్డి' వంటివి బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నాయి.
టాలీవుడ్‌ని ఒకప్పుడు చిన్న చూపు చూసే బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ సినిమా కోసం ఎదురు చూపులు చూస్తోందంటేనే, తెలుగు సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్ధం చేసుకోవచ్చు.. ఇలాంటి విలువైన, ఆసక్తికరమైన ఎన్నో విషయాల్ని ప్రబాస్ పంచుకున్నారు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'సాహో' తెలుగుతో పాటు, తమిళ, హిందీ తదితర భాషల్లోనూ విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. ఆయా భాషల్లో ప్రభాస్ విశ్రాంతి లేకుండా, విరామం తీసుకోకుండా, ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.