కృష్ణంరాజు - ప్రభాస్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వేలు పట్టుకొనే.. ఇండస్ట్రీలోకి వచ్చాడు ప్రభాస్. నా వారసుడు.. ప్రభాసే - అని కృష్ణంరాజు ప్రకటించారు. ప్రభాస్ ఎదుగుదల చూసి.. మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. తనకంటే.. తన కొడుకు పెద్ద స్టార్ అయ్యాడని పొంగిపోయారు. పెదనాన్న అంటే ప్రభాస్ కి గౌరవం, భక్తి. అందుకే తాను ఎంత ఎదిగినా, తన పెద నాన్న దగ్గర మాత్రం ఒదిగి ఉండేవాడు. తన మార్గదర్శి, గురువు... పెదనాన్నే అని గర్వంగా చెప్పుకొనేవాడు. ఇప్పుడు కృష్ణంరాజు లేకపోవడం.. ప్రభాస్‌కి పెద్ద లోటే.
ప్రభాస్ - కృష్ణంరాజులు కలిసి 3 సినిమాల్లో నటించారు. బిల్లా, రెబల్, రాధేశ్యామ్. నిజానికి బిల్లా, రెబల్ అనుకొన్నంత విజయం సాధించలేదు. బిల్లా ఓకే అనిపించుకొంది. రెబల్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్ - కృష్ణంరాజులు కలిసి నటిస్తే సినిమా ఆడదేమో అనుకునేంతగా అభిమానులు భయపడ్డారు. అందుకే... రాధే శ్యామ్ లో కృష్ణంరాజు పేరు అస్సలు పరిగణలోనికి తీసుకోలేదు.
అయితే.. ప్రభాస్ మాత్రం `నా సినిమాలో పెద నాన్న ఉండాల్సిందే` అని పట్టుపట్టాడు. దానికి కారణం.. అప్పటికే... కృష్ణంరాజుకి వయసైపోయింది. ఆయన చివరి దశకు చేరుకొన్నారన్న సంగతి ప్రభాస్‌కి అర్థమైంది. అందుకే మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందో, రాదో అని భయపడి.. రాధే శ్యామ్‌లో... పెదనాన్నకో పాత్ర అప్పగించాడు. ఈ పాత్ర కేవలం తెలుగులోనే కనిపించింది. మిగిలిన భాషల్లో ఆ పాత్రలో సత్యరాజ్ కనిపించడం విశేషం. అలా... ప్రభాస్ ముందు జాగ్రత్త పడకపోతే... పెదనాన్నతో కలిసి నటించే అవకాశాన్ని చేజార్చుకొనేవాడు. అయితే ప్రభాస్‌కి ఒకటే లోటు. తన పెళ్లి పెదనాన్న చూడలేకపోయారే అని. కృష్ణంరాజు.. ప్రభాస్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని చాలా ఆశ పడ్డారు. కానీ.. ఆ ముచ్చట తీరకుండానే వెళ్లిపోయారు.