కథానాయికలకు పట్టిందల్లా బంగారమే. కాస్త నేమ్, ఫేమ్ ఉంటే చాలు... డిమాండ్లే డిమాండ్లు. ఇప్పుడు సౌత్ లో హీరోయిన్లు ఆడిందే ఆట, పాడిందే పాట. స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకీ రూ.2 నుంచి 3 కోట్లు వసూలు చేస్తున్నారు. ఐటెమ్ గీతాల్లో నటించే అవకాశం వస్తే, ఏమాత్రం వదలడం లేదు. ఆ రూపంలోనూ కావల్సినంత పిండుకుంటున్నారు. ఆమధ్య సమంత `పుష్ప`లో ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ పాటకు కోటిన్నర అందుకుంని టాక్. `గని`లో తమన్నా ఐటెమ్ గీతంలో నర్తించింది. ఈ పాటకు గానూ కోటి రూపాయల వరకూ పారితోషికం అందుకుందని సమాచారం. ఇప్పుడు రష్మికకు ఇలాంటి అవకాశమే వచ్చింది.
సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో `యానిమల్` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రణబీర్‌కపూర్ హీరో. ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఆ పాట సౌత్ ఇండియన్ హీరోయిన్ తో చేయించాలన్నది సందీప్ రెడ్డి ఆలోచన. అందుకే రష్మికని సంప్రదించారని తెలుస్తోంది. ఈ పాటలో నటించడానికి రష్మిక ఓకే అందని, అయితే ఏకంగా రూ2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని సమాచారం. రష్మిక ఓ పూర్తి స్థాయి సినిమా చేస్తే, 2 కోట్లు ఇస్తున్నారు. అయితే ఆ సినిమాకి గానూ కనీసం 30 రోజుల పాటు కాల్షీట్లు ఇవ్వాలి. ఐటెమ్ సాంగ్ కి 3 రోజులు చాలు. మహా అయితే మరో రెండు రోజులు. అంటే 5 రోజుల్లో పూర్తవుతుంది. అంత దానికి.. ఏకంగా 2 కోట్లు అడగడంతో నిర్మాతలు ఆశ్చర్యపోయార్ట. ప్రస్తుతం రష్మికతో నిర్మాతలు బేరసారాలు చేస్తున్నారని... కోటిన్నర ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యారని తెలుస్తోంది. కోటిన్నర ఇచ్చినా రష్మికకు బాగానే గిట్టుబాటు అయినట్టు.