బాహుబలితో పాన్ ఇండియా స్టారైపోయాడు ప్రభాస్. ఒక్కో సినిమాకీ వంద కోట్ల పారితోషికం తీసుకొనే స్థాయికి వెళ్లాడు. అయితే.. ఆ తరవాత వచ్చిన `సాహో` అనుకున్నంత ఫలితాన్ని తీసుకురాలేదు. `రాధే శ్యామ్` అయితే డిజాస్టర్ అయిపోయింది. అసలు ఈ కథని ప్రభాస్ ఎందుకు ఎంచుకున్నాడా? అని అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రకరకాలుగా కారణాలు విశ్లేషించారు. ప్రభాస్ కూడా ఈ సినిమా ఫ్లాప్ పై తొలిసారి స్పందించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం చెప్పాడు.
``బహుశా.. నన్ను రొమాంటిక్ కథల్లో చూడ్డానికి సిద్ధంగా లేరేమో. దానికి తోడు మరీ సాఫ్ట్ పాత్రల్లో నన్ను చూడడం ఇష్టపడకపోవొచ్చు`` అని క్లియర్ కట్ గా తన రివ్యూ ఇచ్చేశాడు. రాధేశ్యామ్ పై నెగిటీవ్ రివ్యూల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. అందుకే ప్రభాస్ కూడా ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఓ సినిమా ఫ్లాప్ అయినా సరే.. దాని గురించి ఆలోచించడానికీ, మాట్లాడడానికి హీరోలు పెద్దగా ఇష్టపడరు. పోస్ట్ మార్టమ్ జోలికి వెళ్లరు.కానీ ప్రభాస్ మాత్రం ధైర్యంగా మాట్లాడాడు. తప్పుల్ని తెలుసుకున్నాడు. అది ఆహ్వానించదగిన పరిణామమే.