ఒక సినిమా - రెండు భాగాలు అనేది ఇప్పుడు సరికొత్త మార్కెట్ సూత్రం అయిపోయింది. బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. కేజీఎఫ్, పుష్ప వాటిని అనుసరించాయి. ఇప్పుడు సలార్ కూడా ఈ జాబితాలో చేరిపోయిందని టాక్. సలార్‌ని సైతం రెండు భాగాలుగా చూపించబోతున్నారన్న టాక్ దేశమంతా హల్ చల్ చేస్తోంది.
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `సలార్`. ఈ వేసవిలో విడుదల కావాల్సివుంది. అయితే విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు.. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. సలార్ 1.. ఈ యేడాది అక్టోబరులో విడుదల చేసి, సలార్ 2ని... 2023 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్.
దానికి కారణం వుంది. సలార్ లెంగ్త్ చాలా ఎక్కువ వచ్చిందట. పుష్పలా రెండు భాగాలు చేస్తే.. మార్కెట్ పరంగా కలిసొస్తుందని నమ్ముతున్నారు. సలార్‌కి విపరీతమైన బడ్జెట్ అయిపోయింది. సలార్‌ని ఒక భాగంగా విడుదల చేస్తే.. నిర్మాతలకు ఆ పెట్టుబడి రాబట్టుకోవడం కష్టం. అందుకే పార్ట్ 2 చేయాలన్న ఆలోచన వచ్చిందని సమాచారం. కేజీఎఫ్ ని కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించాడు. అది ఆ సినిమాకి బాగా కలిసొచ్చింది. అదే.. ఫార్ములా ఇప్పుడు సలార్ అప్లయ్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సివుంది.