ఇంట్లో పూజ గది ఉందని థియేటర్లకు గుడికి వెళ్లడం మానేస్తామా? సినిమా కూడా అంతే. ఇంట్లో ఓటీటీ ఉన్నా.. సినిమా చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.. అంటూ లాజిక్ తో కొట్టాడు ప్రభాస్.
సినిమా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్ల వరకూ రావడం లేదన్న భయం అందరినీ వెంటాడుతున్న వేళ.. `సీతారామం` థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే చూడాలని, ఆ అనుభూతిని ఆస్వాదించాలని ప్రభాస్ అంటున్నాడు.
`సీతారామం` ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ ఇచ్చిన క్యూట్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని విజువల్స్, లొకేషన్స్ అదిరిపోయాయని, రష్యాలో తెరకెక్కించిన సీన్ల కోసమైనా ఈ సినిమాని థియేటర్లలో చూడాలని ప్రభాస్ అంటున్నాడు. నిజమే.. ట్రైలర్లలో విజువల్స్ ఓ రేంజులో ఉన్నాయి. ఇలాంటి సినిమాని బుల్లి తెరలోనో, ఓటీటీలోనో చూస్తే ఏం మజా వస్తుంది. అందుకే థియేటర్లకు వెళ్లాల్సిందే. పైగా చెప్పింది మన ఫేవరెట్ డార్లింగ్ అయినప్పుడు ఆ మాట మరింత స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన లవ్ స్టోరీ సీతారామం. ఇందులో యుద్ధ నేపథ్యం కూడా కలిసి ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దుల్కర్ సల్మాన్, రష్మిక, మృణాల్ ఠాకూర్, సుమంత్, ప్రకాష్‌రాజ్, భూమిక.. ఇలా బోలెడంత స్టార్ కాస్టింగ్ ఉంది. పైగా పాటలన్నీ అదిరిపోయాయి. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే.. మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు.. పబ్లిసిటీతో మరింత హైప్ వచ్చింది. చివర్లో ప్రభాస్ వచ్చి, తన స్పీచుతో ఈ సినిమాకి మరింత బలాన్ని అందించాడు. సో.. శుక్రవారం నుంచి సీతారామం ఆడుతున్న థియేటర్లు కళకళలాడిపోవడం ఖాయం.