ఫ్యాన్స్‌కి మళ్లీ హ్యాండివ్వబోతున్న ప్రభాస్? ప్రభాస్ సినిమా అంటే అదో పంచవర్ష ప్రణాళికలా తయారవుతోంది. ఏ సినిమా ఓ పట్టాన పూర్తవడం లేదు. బాహుబలి, సాహో విషయాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు రాధాకృష్ణ సినిమా కూడా ఇలానే తయారవుతోంది. ప్రభాస్ - రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. 2019లోనే ఈ సినిమా వస్తుందనుకున్నారు. కానీ... 2021కి వెళ్లిపోయింది. 2021 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే.. అప్పటికీ ఈ సినిమా రాదని తెలుస్తోంది.
2021 దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని, అక్టోబరు 16న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం అందుతోంది. సాహో దెబ్బతో ఈ కథలో భారీ మార్పులు చేశారు. ఇప్పటి వరకూ తెరకెక్కించిన సన్నివేశాల్ని పక్కన పెట్టి మళ్లీ కొత్తగా కథ రాసుకున్నారు. అందుకే ఇంత ఆలస్యం అవుతోందని సమాచారం. మొత్తానికి ప్రభాస్ తన ఫ్యాన్స్‌కి మరోసారి హ్యాండిచ్చాడు. ప్రభాస్‌ని వెండి తెరపై చూడాలంటే 2021 దసరా వరకూ ఆగాల్సిందే.