మొన్న 'దేవి' ఇప్పుడు 'లక్ష్మి'.!

By iQlikMovies - August 04, 2018 - 13:03 PM IST

మరిన్ని వార్తలు

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా ప్రభుదేవా సాధించిన గుర్తింపు అంతా ఇంతా కాదు, డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా చాలా మందికి ఇన్స్‌ప్రేషన్‌ ప్రభుదేవా. అయితే గత కొంతకాలంగా ప్రభుదేవా కొరియోగ్రఫీకి దూరంగా ఉంటూ, దర్శకత్వ విభాగంలో రాణిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు రూపొందిస్తున్నారు ప్రభుదేవా. 

ఇటీవల 'అభినేత్రి' సినిమాతో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభుదేవా త్వరలో 'లక్ష్మి' చిత్రంతో రానున్నారు. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభుదేవాకి జోడీగా ఐశ్వర్య నటిస్తోంది. జూనియర్‌ డాన్స్‌ రియాల్టీ షో 'సూపర్‌ డాన్సర్‌ సీజన్‌ 1' విజేత దిత్యా బండే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. డాన్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఈ చిన్నారి నటన అత్యద్భుతంగా ఉండబోతోంది. 

ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసే సన్నివేశాలు, చిన్న పిల్లల్ని ఆకర్షించే సన్నివేశాలతో న భూతో న భవిష్యతి అనే రేంజ్‌ డాన్స్‌ పర్‌పామెన్స్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. రియల్‌ లైఫ్‌ పాత్రనే రీల్‌ లైఫ్‌లో పోషిస్తున్నారు ప్రభుదేవా ఈ సినిమాలో. ఆ చిన్నారికి డాన్స్‌ మాస్టర్‌ పాత్రలో ప్రభుదేవా నటన ఆశక్తికరంగా సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. 

తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో రూపొందిన 'అభినేత్రి' సినిమా మంచి విజయం అందుకుంది. అదే తరహాలో 'లక్ష్మి' కూడా మంచి విజయం సాధిస్తుందని ప్రభుదేవా అభిమానులు ఆశిస్తున్నారు.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS