అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరోలతో రాఘవేంద్రరావు వారసత్వం కొనసాగించాలనుకున్నాడు ప్రకాష్ కోవెలమూడి. అయితే ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసు దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి.
ఆ తరవాత శర్వానంద్‌తో ఓ సినిమా చేద్దామన్న ప్రయత్నాల్లో పడిపోయాడు. కానీ శర్వా.. `నో` చెప్పడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తెలుగులో ఇక ప్రకాష్ సినిమా తీయడం కష్టం అనుకుంటున్న తరుణంలో ఓ భారీ షాక్ ఇచ్చాడు. ఏకంగా బాలీవుడ్లో సినిమా తీస్తూ.. ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్వీన్ కథానాయిక కంగనా రనౌత్‌తో ప్రకాష్ ఓ సినిమా పట్టాలెక్కించనున్నాడు. దీనికి ఏక్తా కపూర్ నిర్మాత.
ఈ చిత్రానికి `మెంటల్ హై క్యా` అనే టైటిల్ ఖరారు చేశారు. రాజ్ కుమార్ రావ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. కంగనా, రాజ్‌కుమార్ పేరు చెప్పగానే `క్వీన్` గుర్తొస్తుంది. ఆ జంటని మరోసారి వెండి తెరపై చూపించబోతున్నాడన్నమాట. దర్శకుడిగా ప్రకాష్‌కి ఇది ముచ్చటగా మూడో ప్రయత్నం.
బాలీవుడ్లో నిరూపించుకోగలిగితే.. అప్పుడు ప్రకాష్‌తో సినిమా చేయడానికి తెలుగు హీరోలు రెడీ అవుతారేమో..!