ప్రకాష్‌రాజ్ సినిమా డైరీ ఎప్పుడూ బిజీనే. అలాంటిది ఈ మధ్య ఆయన సామాజిక అంశాలపై ఘాటుగా స్పందిస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. దాంతో ప్రకాష్ రాజ్ ప్రశ్నలు హాట్ టాపిక్స్ అవుతున్నాయి ప్రస్తుతం. అయితే ప్రకాష్ రాజ్ సినిమాలు లేక ఖాళీగా ఉన్న కారణంగానే ఇలా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి వార్తల్లో నిలుస్తున్నారు అంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ గాసిప్స్‌ని ఆయన ఖండించారు. సినిమాలతో ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నాననీ ప్రకాష్‌రాజ్ చెప్పారు. దాదాపు ఏడాదిన్నర వరకూ ఆయన కాల్‌షీట్స్ ఖాళీ లేవనీ ఆయన అన్నారు.
అయితే ఎందుకు సెన్సేషనల్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారంటే, దేశంలో ఓ సామాన్య పౌరుడిగా ప్రశిస్తున్నాను అంతే.. అని ఆయన సమాధానమిచ్చారు. మరో పక్క ప్రకాష్‌రాజ్ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలతో బిజీగా ఉన్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. దానికీ ఆయన సూటిగా సమాధానమిచ్చారు. తానేం ఓ వ్యక్తినో, ఓ పార్టీనో ప్రశ్నించడం లేదనీ, ప్రభుత్వాన్ని ఓ పౌరుడిగా ప్రశ్నించే హక్కు తనకుందనీ, ఆదే చేస్తున్నాననీ అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదనీ ఆన్నారాయన. కర్ణాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యోదంతంపై కూడా ప్రకాష్‌రాజ్ ఆ విధంగానే స్పందించారనీ, అయితే ఆ కుటుంబంతో ఉన్న రిలేషన్ కారణంగా మరింత బాధాతప్త హృదయంతో స్పందించాల్సి వచ్చిందనీ ఆయన అన్నారు.
అలాగే ఆయనకి వచ్చిన అవార్డుల్ని తిరిగిచ్చేస్తానన్న విషయంలో కూడా ప్రకాష్‌రాజ్ స్పందించి, అలా చేసేందుకు తానేం పిచ్చివాడిని కాదనీ ఆయన అన్నారు. తానేం వివాదాలు సృష్టించడం లేదనీ, జస్ట్ ఆస్కింగ్ చేస్తున్నాననీ, పిరికివాడిలా మౌనంగా ఉండడం తనకిష్టం లేదనీ ప్రకాష్‌రాజ్ అన్నారు. ప్రస్తుతం చరణ్‌తో ఓ సినిమాలోనూ, మహేష్‌తో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అలాగే హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రకాష్‌రాజ్.