మహేష్‌బాబు సినిమా నుండి జగపతిబాబు తప్పుకున్నట్లు తాజా సమాచారం. మహేష్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ షూటింగ్లో పాల్గొన్న జగపతిబాబుకు విచిత్ర అనుభవం ఎదురైంది. తనకు స్క్రిప్టులో వినిపించిన సన్నివేశానికీ, అక్కడ జరుగుతున్న సన్నివేశానికీ తేడా ఉండడంతో, తాజా సన్నివేశం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన జగపతిబాబు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్లేస్‌లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, జగపతిబాబు అవుట్ అవ్వడం నిజమే అని బలంగా టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో సాగే ప్రత్యేక సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే, మొన్న ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రాజుగారి గది 3' నుండి మిల్కీబ్యూటీ కూడా ఇలాగే తప్పుకుంది.
ఇక్కడా అక్కడా స్క్రిప్ట్ ఛేంజింగ్ అనేది ఒక్కటే రీజన్ కావడం గమనించాల్సిన అంశం. ఈ సినిమాని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.