సినీ నటుడు ప్రకాష్ రాజ్, రాజకీయాల్లోకి వస్తున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ చేసిన ప్రకటన సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో ప్రకాష్ రాజ్ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న విషయం విదితమే. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదనీ, అన్ని రాజకీయ పార్టీల్నీ ఒకేలా చూస్తానని పలు సందర్భాల్లో చెప్పిన ఈ విలక్షణ నటుడు, పలు అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో విభేదిస్తూ వస్తున్నారు.
మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భావజాలంపై ప్రకాష్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు పలికిన సంగతి తెల్సిందే. అయితే ప్రకాష్ రాజ్, తెలుగు రాష్ట్రాల నుంచి కాక, కర్నాటక నుంచి పోటీ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగానే ఆయన బరిలోకి దిగుతారట.
2019లో దేశంలో అధికారంలోకి వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని ప్రకాష్ రాజ్ ప్రకటించడం మరో సంచలనంగా మారింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది 'ప్రజా ప్రభుత్వమే'. ఎందుకంటే, ఆయా పార్టీలు చేసే ప్రచారం అలా వుంటుంది. అంతిమంగా ప్రజలు ఓట్లేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. వచ్చాక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలంటూ రాజకీయ దుమారమూ మామేలే. ఏదిఏమైనా ప్రకాష్ రాజ్, రాజకీయ రంగ ప్రవేశం తెలుగు రాష్ట్రాల్లోనూ అందరూ ఆసక్తికరంగా చర్చించుకునేలా చేయడం గమనార్హం.