చిత్రం: ప్రతినిధి2
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
కూర్పు: రవితేజ గిరిజాల
బ్యానర్స్: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
విడుదల తేదీ: 10 మే 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
నారా రోహిత్ నుంచి సినిమా వచ్చిన చాలా కాలమైయింది. కొన్నేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉంటున్న ఆయన ‘ప్రతినిధి2’తో మళ్ళీ కెమరాముందుకు వచ్చారు. నారా రోహిత్ గతంలో చేసిన ‘ప్రతినిధి’ సినిమాకి కొనసాగింపుగా ఇది రూపొందింది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తుపు దర్శకత్వం వహించారు. ఏపీ రాజకీయాలపై విమర్శనాస్త్రంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ ట్రైలర్ చూస్తే అర్ధమైయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులోని కంటెంట్ ఏపీ రాజకీయాలకు అద్దం పట్టిందా ?
కథ: నిజం కోసం బతికే నిజాయితీ గల జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్‌ని ఎన్.ఎన్.సి ఛానల్ సీఈఓగా నియమిస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) క్యాంప్ ఆఫీస్ లో జరిగిన బాంబుదాడిలో చనిపోతారు. ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఈ కేసుకి చేతన్ కి వున్న సంబంధం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.
కొన్ని నిజజీవితంలో జరిగిన రాజకీయ సంఘటనలకు కల్పన జోడించి చేసిన చిత్రమిది. ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు ఏపీ రాజీయాలని గుర్తు చేసినప్పటికీ తర్వాత కథని ఒక ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ గా నడిపారు. హీరో పాత్రని, జర్నలిజం గొప్పతనాన్ని చాటే బిగినింగ్ సీన్స్ ఆసక్తికరంగానే వుంటాయి. మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) అవినీతిని బయటపెట్టడం, ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ (పృథ్వీరాజ్) చేసిన ఘోరాలు బయటపెట్టడం టీవీలో బ్రేకింగ్ న్యూస్ లా అనిపిస్తాయి. ఓటు విలువని చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.
ఇంటర్వెల్ కి ముందు చోటు చేసుకునే మలుపు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత ఈ కథ, కథనాలు పూర్తిగా పట్టుతప్పుతాయి. సిఎం మర్డర్ కేసు విచారణ ఏ మాత్రం రక్తికట్టదు. కొన్ని సీన్స్ అయితే ఓవర్ డ్రామాగా అనిపిస్తాయి. సీబీఐ విచారణని మరీ పేలవంగా చూపించారు. క్లైమాక్స్ కూడా తేలిపోతుంది. నిజ జీవిత సంఘటనలకు ఫిక్షన్ జోడించడం ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ ఇందులో సరిగ్గా కుదరలేదు.
నటీనటులు నటన: జర్నలిస్ట్‌గా పాత్రలో రోహిత్ ఒదిగిపోయారు. డైలాగులు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. ఆయన వాయిస్ పాత్రకు ప్లస్ అయ్యింది. యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశారు. హీరోయిన్ సిరి లెల్లా పాత్ర అంతంత మాత్రమే. సచిన్ ఖేడ్కర్, దినేశ్ తేజ్, జిషుసేన్ గుప్తా, అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయభాను పాత్రలు ఓకే అనిపిస్తాయి.
టెక్నికల్ గా: మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం హెవీగా వుంది. కొన్ని సీన్స్ లో కేవలం నేపధ్య సంగీతమే డామినేటింగ్ వినిపిస్తుంది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం డీసెంట్ గా వుంది. చాలా సోషల్ రెస్పాన్స్ బిలిటీ డైలాగులు రాసుకున్నారు. దర్శకుడు మూర్తి ఫిక్షన్ ని జోడించే క్రమంలో ఇంకాస్త లాజికల్ గా క్రియేటివ్ గా వర్క్ చేయాల్సింది.
ప్లస్ పాయింట్స్
నారా రోహిత్
కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
కథ, కథనం
సెకండ్ హాఫ్
ఫైనల్ వర్దిక్ట్ : బలంగా ప్రశ్నించలేకపోయిన 'ప్రతినిధి'.