నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం : మారుతీ
నిర్మాతలు : జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్
సంగీతం : ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్ : జయ కుమార్ సంపత్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
రేటింగ్: 2.75/5
కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు ఈమధ్య చాలా తక్కువగానే వస్తున్నాయి. అమ్మా, నాన్న, మావయ్య, వదిన, మావయ్య, తాతయ్య, అమ్మమ్మ... వీళ్లందరినీ ఒక్క ఫ్రేములో చూడడం ఎంత బాగుంటుందో..? మనదైన బంధాలు, ఆప్యాయతలూ గుర్తు చేయడం ఇంకెంత పసందుగా ఉంటుందో..? అందుకే ఫ్యామిలీ డ్రామాలు దాదాపుగా ఫెయిల్ అవ్వవు. కనీసం యావరేజ్ మార్క్ దగ్గరైనా ఆగుతాయి. సరిగా తీస్తే.. శతమానం భవతిలా నిలబడిపోతుంది. అందుకే మారుతి కూడా ఈసారి ఫ్యామిలీ డ్రామాని ఎంచుకున్నాడు. అదే `ప్రతిరోజూ పంగడే`. చావు కూడా సంబరంలా జరుపుకోవాలంటూ ఓ సందేశం ఇచ్చే ప్రయత్నం ఈ సినిమా. మరి మారుతి ప్రయత్నం ఎలా సాగింది? ఈ ఫ్యామిలీ డ్రామా ఎంత వర్కవుట్ అయ్యింది?
*కథ
ఇదో తాతయ్య (సత్యరాజ్) కథ. లంగ్ క్యాన్సర్‌తో మరి కొద్దిరోజుల్లోనే తనువు చాలించడానికి సిద్ధమైన ఓ పెద్దాయన కథ. చివరి రోజుల్లో తనవాళ్లనందరినీ చూడాలనుకుంటాడు. వాళ్లమధ్య చివరి శ్వాస వదలాలనుకుంటాడు. అయితే మనవడు (సాయిధరమ్ తేజ్) మాత్రం... తన తాతయ్యని నవ్వుతూ సాగనంపాలనుకుంటాడు. తాతయ్య తీరని కోరికల్ని, కలల్నీ తీర్చేసి - చివరి రోజుల్లో కొత్త జీవితాన్ని చూపించాలనుకుంటాడు. పెద్దాయన్న సాగనంపడానికి వచ్చిన కొడుకులు మాత్రం `నాన్నకు నిజంగానే జబ్బు ఉందా? లేదా? ఎప్పుడు పోతాడు` అంటూ రోజుల్ని లెక్కేసుకుంటారు. వీటి మధ్య ఆ తాతయ్య అంతిమ మజిలీ ఎలా సాగింది? అనేదే `ప్రతిరోజూ పండగే` కథ.
*విశ్లేషణ
ప్రచార చిత్రాల్లోనే కథ చెప్పేసి,ప్రేక్షకుల్ని ముందే ప్రిపేర్ చేసేశాడు మారుతి. యూత్‌ని ఆకట్టుకునే సినిమాలు తీసే మారుతి- ఈసారి కుటుంబ కథ ఎంచుకున్నాడు. అయితే తన బలం.. వినోదం. సన్నివేశంలో విషయం లేకపోయినా, సరదా సన్నివేశాలతో కథని హాయిగా సాగిపోయేలా చేస్తాడు. ఈ సినిమాలోనూ ఆ మార్కు కనిపిస్తుంది. కథని ఓ సీరియస్ మోడ్‌లో మొదలెట్టాడు. క్రమంగా తనదైన మార్క్‌లోకి వెళ్లిపోయాడు. పాత్రలన్నింటినీ ఓ చోట చేర్చి - వాళ్ల మాటల్లోనూ, చేతల్లోనూ హాస్యం పిండుకున్నాడు. టిక్ టాక్ పిచ్చిని హీరోయిన్‌కి అన్వయించి, ఆ పాత్రతోనూ నవ్వులు పంచేశాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, పాటలూ, నవ్వులతో తొలి సగం ఎలాంటి కంప్లైంటూ లేకుండా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్... మరింత బాగా నచ్చుతుంది. నవ్వుకుంటూ థియేటర్లలోంచి బయటకు వెళ్తారు.
సమస్యంతా ద్వితీయార్థంలోనే వచ్చింది. సినిమా అంతా ఒకే ఎమోషన్. అదే పెద్దాయన చావు. దానిపైనే సన్నివేశాలు రాసుకున్నాడు. నవ్వించాలన్నా ఆ పాయింటే, ఏడిపించాలన్నా ఆ పాయింటే. క్లాసు పీకాలన్నా ఆ పాయింటే. ఒకే పాయింట్ చుట్టూ తిప్పీ తిప్పీ కాస్త బోర్ కొట్టించాడు. ఫ్యామిలీ ఎమోషన్, అందులోంచి పండించే సెంటిమెంట్... వీటి చుట్టూ సన్నివేశాలు అల్లుకోవడం అంత తేలికైన విషయం కాదు. సన్నివేశాల్లో బలం లేకపోతే.. ఆ ఎమోషన్ కాస్త బలవంతంగా పలికిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ కథలో ప్రధాన లోపం అదే. ఎమోషన్ సీన్లు తెరపై వస్తున్నా.. ప్రేక్షకులుగా మనం ఇన్‌వాల్వ్ అవ్వలేం. ఇక్కడా అదే జరిగింది. తెరపై భారీ డైలాగులూ, ఎమోషన్ల సీన్లూ వరుస కడతాయి. కానీ.. అవన్నీ బోరింగ్‌గానే అనిపిస్తాయి.
మారుతి నవ్వించాలనుకున్న చోట సక్సెస్ అయ్యాడు. ఎమోషన్ మాత్రం పండించలేకపోయాడు. ఈ రెండూ వర్కవుట్ అయితే.. కచ్చితంగా ఈసినిమా శతమానం భవతిని మించిపోయే విజయాన్ని అందుకునేది. మధ్యలో రావు రమేష్ అండ్ కో అందించిన కామెడీ వల్ల ద్వితీయార్థంలో అక్కడక్కడ ఉపశమనం లభిస్తుంది. ఇది పూర్తిగా కామెడీ బేస్డ్ సినిమాగా తీసినా బాగుండేది అనిపిస్తుంది.
*నటీనటులు
తేజూకి ఇది కొత్త పాత్రే. ఎమోషన్స్‌ని పండించడానికి ప్రయత్నించాడు. ఓ మంచి మనవడిగా కనిపించాడు. తాతలకెవరికైనా ఇలాంటి మనవడు నాకూ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. తనకు అలవాటైన డాన్సుల్లో తనదైన స్టైల్ చూపించాడు. రాశీఖన్నా టిక్ టాక్ భామగా నవ్వించింది. తన నటనలో ఇది వరకటి కంటే పరిణితి కనిపిస్తోంది. చలాకీగా ఉంది. సత్యరాజ్ పాత్ర ఈ సినిమాకి మూల స్థంభం లాంటిది. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఇంకెవరినీ ఊహించలేం. అయితే అందరికంటే ఎక్కువ మార్కులు రావు రమేష్‌కి పడతాయి. తనదైన నటనతో, ఛమక్కుతో.. వినోదం పంచి పెట్టాడు. ఇలాంటి పాత్ర మరొకటి ఉంటే ఈ సినిమా ఫలితం ఇంకోలా ఉండేదనిపిస్తుంది.
*సాంకేతికత
తమన్ పాటలు, వాటిని చిత్రీకరించిన పద్ధతీ బాగున్నాయి. గీతా ఆర్ట్స్ స్థాయిలోనే నిర్మాణ విలువలున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పనితనం ఆకట్టుకుంటుంది. ఆయన తీర్చిదిద్దిన ఇంటి సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మారుతి మాటలు చాలా చోట్ల నవ్వించాయి. కానీ ఎమోషన్‌ని మాత్రం బలంగా పండించలేకపోయింది. అక్కడ ఇంకాస్త శ్రద్ధ చూపించినట్టైతే.. ఈ యేడాది మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా మిగిలిపోయేది.
*ప్లస్ పాయింట్స్
తేజ్, సత్యరాజ్‌ల నటన
వినోదం
టెక్నికల్ వాల్యూస్
*మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
ఎమోషన్ పండకపోవడం
*ఫైనల్ వర్డిక్ట్: కామెడీ ఒకే... ఎమోషన్ నాట్ ఒకే