బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా చలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. ఈ ముద్దుగుమ్మకి అరుదైన పురస్కారం దక్కింది.
బరేలీ అంతర్జాతీయ వర్సిటీ ప్రియాంకా చోప్రాకు గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని ప్రియాంకా తన స్వస్థలమైన యూపీలోని బరేలీలో అందుకోనుండడం విశేషం. ఆదివారం ఈ గౌరవ పురస్కారాన్ని అందుకోనుంది ప్రియాంకా. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వస్థలానికి వెళ్లనున్న ప్రియాంక కోసం యూపీలో ఆమె అభిమానులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్షవర్ధన్, యూపీ ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ హాజరు కానున్నారు. తన కుమారైకు ఇంతటి గౌరవం దక్కినందుకు ఆమె తల్లి మధు చోప్రా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఇటు సినీ రంగంలో ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. సినిమాలతో పాటు, బుల్లితెర సిరీస్‌లోనూ తన హవా చూపిస్తోంది ప్రియాంకా చోప్రా. హాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటు బాలీవుడ్‌లోనూ ప్రియాంకా బిజీగానే ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా, సామాజిక అంశాల పట్ల కూడా చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటుంది ప్రియాంకా చోప్రా. బాలికల విద్య, వైద్య తదితర అంశాల అభివృద్ధి కోసం ఓ సేవా సంస్థను నడుపుతోంది ప్రియాంకా చోప్రా.
ఇవన్నీ కాకుండా యూనీసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేస్తున్న సోషల్ సర్వీస్‌కిగానూ గతేడాది పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది ప్రియాంకా చోప్రాని. ఇటీవలే ఆసియా సెక్సీయెస్ట్ విమెన్‌గా మరోసారి ఘనతను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి సేవా రంగంలో మదర్ థెరీసా పురస్కారం కూడా ఈ మధ్యనే లభించింది.