బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా ఉండడంతో చిత్రసీమ ఈ కేసుపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ కేసులో నిందితుడైన అశోక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా పరారీలో ఉన్న అశోక్ రెడ్డిఈ రోజు ఉదయం ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ప్రస్తుతం అశోక్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్‌రెడ్డి, సాయిరెడ్డి, అశోక్ రెడ్డి ప్రధాన నిందితులు. సాయి, దేవరాజ్ లను ఇది వరకే అరెస్టు చేసి, రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. మంగళవారమే.. అశోక్ రెడ్డిని అరెస్టు చేయాల్సింది. కానీ.. అశోక్ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుదర్లేదు. ఎట్టకేలకు ఆయనే పోలీసులకు లొంగిపోయారు.
సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో అశోక్ రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దేవరాజ్కు శ్రావణి దగ్గర కావటాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. సాయికృష్ణా రెడ్డి ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది.