కోలీవుడ్ నిర్మాతమండలి ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ విమర్శలకి గురి అవుతూ ఉంటారు. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. తమిళనాట థియేటర్ల దగ్గర రివ్యూలు ఇచ్చే వారికి పర్మిషన్ లేదంటూ, వారిని అక్కడికి అనుమతించ కూడదని కోలీవుడ్ నిర్మాతల మండలి తీర్మానించింది. ఈ నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుని ప్రశ్నించగా విభిన్నంగా స్పందించారు. రీసెంట్ గా తన సినిమా కోసం ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కోలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయం అక్కడ విజయవంతమవుతుంది. తరవాత తెలుగు రాష్ట్రాల్లో కూడా అది అమలయ్యే అవకాశాలున్నాయని, అది వ్యక్తిగత నిర్ణయం కాదని సమిష్టి నిర్ణయం అని ఫిల్మ్ ఛాంబర్ కి ఆ అధికారం ఉందని, ఎగ్జిబిటర్లు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కొందరు సినిమా చూసి థియేటర్ల దగ్గరే రివ్యూలు ఇచ్చేస్తున్నారని, యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా విజయంపై ప్రభావం చూపుతున్నాయని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కేవలం రివ్యూల వల్లనే నష్టపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి రివ్యూవర్లని అడ్డుకునేందుకే తమిళ ఇండస్ట్రీలో అన్ని సంఘాలు కలిసికట్టుగా పోరాడుతున్నాయి. థియేటర్ ఓనర్స్ కూడా యూట్యూబ్ ఛానళ్లను సినిమా ధియేటర్ దరిదాపుల్లోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే, ఫస్ట్ షో కి థియేటర్ దగ్గరికి పబ్లిక్ రివ్యూవర్లకి ఛాన్స్ ఇవ్వకుండా నిరోధించాలని నిర్ణయించుకున్నారు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నామని, ఇకపై అలాంటి విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు దిల్ రాజు. తెలుగులో కూడా ఈ నిబంధన పెడితే రివ్యూవర్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతి సినిమాల నుంచే కోలీవుడ్ నిర్ణయాన్ని టాలీవుడ్ లో కూడా అమలు చేసే ఛాన్స్ ఉన్నట్లు వినిపిస్తోంది.