సినీ పరిశ్రమలో సీనియర్ మోస్ట్ ఆయన. నిర్మాతగా, నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఆ 105 ఏళ్ళ కుర్రాడు ఇంకెవరో కాదు, రాఘవ. ప్రతాప్ ఆర్ట్స్ అధినేతగా కె. రాఘవ సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితుడు. 90 ఏళ్ళ వయసులో టిప్ టాప్‌గా జీన్స్, టీ షర్ట్ ధరించి కుర్రాడిలా కన్పించడం బహుశా రాఘవకే చెల్లిందనడం అతిశయోక్తి కాదేమో.
1913ఓల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన జన్మించారు. సినీ పరిశ్రమలో కింది స్థాయి నుంచి నిర్మాత స్థాయి వరకూ ఆయన ఎదిగిన వైనం, ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని చెబుతుంటారు. 'తాత మనవడు', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తదితర సినిమాల్ని నిర్మించిన రాఘవ, దాసరి నారాయణరావు వంటి ఎందరో సినీ ప్రముఖుల్ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఎప్పుడూ ఫిట్‌గా కన్పించే రాఘవ, ఫిట్‌నెస్‌కి వయసు అడ్డంకి కానే కాదని చెబుతుండేవారు.
తన ఆరోగ్య రహస్యం ఆనందంగా వుండడమేనని చెప్పేవారాయన. రాఘవ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తెలుగు సినిమా మరో పెద్ద దిక్కుని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు చెమర్చిన కళ్ళతో వ్యాఖ్యానిస్తున్నారు. సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా పూర్తి చేసుకున్న రాఘవ ధన్య జీవి అని అభిప్రాయపడుతోంది తెలుగు సినీ పరిశ్రమ.