ఎప్పుడూ లేనంతగా `మా` ఎన్నికలు వాడీ వేడీగా జరిగాయి. ఇది వరకటితో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. అయితే... కొంతమంది బడా హీరోలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్‌బాబు, వెంకటేష్, విజయ్ దేవరకొండ... ఇలాంటి వాళ్లంతా ఓటింగ్ కి హాజరు కాలేదు.యువ హీరోల్లో చాలామంది ఓటింగ్ కి డుమ్మా కొట్టారు.
మా ఎన్నికల్లో జరిగిన రగడ ఇంతా అంతా కాదు. ఓరకంగా `మా` ప్రతిష్టని బజారుకి ఈడ్చేశారంతా. దాంతో మాలో... గెలుపు ఓటములు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఇలాంటప్పుడే హీరోలంతా కలసి రావాలి. కానీ అది జరగలేదు. ``ఈ ఎన్నికలలో నేను ఓటేయను`` అని జీవితకు ఎన్టీఆర్ ముందే చెప్పాడు. చెప్పినట్టుగానే ఓటింగ్ కి రాలేదు ఎన్టీఆర్. చాలామంది హీరోలు హైదరాబాద్ లోనే ఉన్నా, వాళ్లెవరూ ఓటింగ్ కి రాకపోవడం విచిత్రంగా మారింది.
మెగా కాంపౌండ్‌లో ఉన్న హీరోల్లో చాలామంది కనిపించలేదు. దాంతో `మా` అంటే వీళ్లకు సంబంధం లేని వ్యవహారమా? అనే విమర్శలు మొదలయ్యాయి. మా అనేది ఓ వ్యవస్థ. నటీనటుల ఐకమత్యానికి వేదిక. ఇలాంటప్పుడు కూడా ఆ ఐకమత్యం చూపించకపోతే ఎలా?