పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా సినిమా 'మెహబూబా'. బాలయ్యతో 'పైసా వసూల్' తెరకెక్కించిన పూరీ జగన్నాధ్ ఈసారి తన కొడుకుపై కాన్‌సన్‌ట్రేషన్ చేశాడు. పూరీ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఆకాష్ పూరీని హీరోగా పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసేందుకు పూరీ స్వయంగా తానే బరిలోకి దిగాడు.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ని హిమాచల్ ప్రదేశ్‌లో జరిపారు. ఎముకలు కొరికే చలిలో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్‌లో లాంఛ్ అయ్యింది. ఆర్ట్ డైరెక్టర్ జానీ ఆధ్వర్యంలో ఈ భారీ సెట్‌ని ఏర్పాటు చేశారు. సెట్ సూపర్బ్‌గా ఉంది. సెట్ అంటే అలాంటి ఇలాంటి సెట్ కాదు. చూస్తుంటే, ఇదేదో ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ అన్న ఫీలింగ్ కలుగుతోంది. అంత నేచురల్‌గా ఈ సెట్‌ని ఏర్పాటు చేశారు. బ్యాక్ గ్రౌండ్ ఫీచర్స్, కలర్ బ్యాక్ డ్రాప్, లొకేషన్స్ అంతా అచ్చం ఇండియా - పాకిస్థాన్ బోర్డర్‌నే తలపిస్తోంది.
సినిమా కాన్సెప్ట్ కూడా ఇండియా - పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలోనే ఉండబోతోంది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధ సన్నివేశాల్ని చాలా లైవ్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. కొడుకు ఆకాష్ పూరీకి ఈ చిత్రం ఓ మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చి పెట్టనుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో పూరీ జగన్నాధ్, నేహా శెట్టి అనే కొత్తమ్మాయిని హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితమవుతోంది.