చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ని వెండితెరకు హీరోగా పరిచయం చేసింది పూరి జగన్నాథ్. 'చిరుత' సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు రామ్‌చరణ్. ఓ స్టార్ హీరో కుమారుడ్ని ఎలా లాంఛ్ చెయ్యాలో అలా పూరి ఆ సినిమాతో చరణ్‌ని లాంఛ్ చేశాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ఆ సినిమా కోసం పూరి ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే. అలా డైరెక్టర్ పూరీ ఇచ్చిన ప్లాట్‌ఫామ్ చరణ్‌ని మెగా పవర్ స్టార్‌ని చేసింది. ఈసారి పూరి మరో స్టార్ హీరో తనయుడ్ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను భుజానికెత్తుకోనున్నాడట. 'పైసావసూల్' సినిమా టైమ్‌లో పూరితో ఏర్పడ్డ ర్యాపో కారణంగా బాలయ్య, పూరి మీద పూర్తి నమ్మకంతో మోక్షజ్ఞ విషయాన్ని పూరి వద్ద ప్రస్తావించాడని సమాచారమ్. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదుగానీ, దాదాపుగా ఓ మాట అనుకున్నారనే టాక్ వినవస్తోంది. ఈ ఏడాదే మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేస్తానని బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. అసలిప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాల్సి ఉంది. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' టైంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని ఫ్యాన్స్ ఆశించారు కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఈ ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందన్న సంగతి పక్కాగా అనౌన్స్ చేశారు బాలయ్య. ఒకవేళ 'పైసా వసూల్' సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడా? ఏమో జరిగినా జరగొచ్చు. 'మనం' సినిమాలో అక్కినేని వారసుడు అఖిల్ ఎంట్రీ జరిగినట్లుగా, మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమాలో ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. 'పైసా వసూల్' ఈ విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.