2021లో టాలీవుడ్ సాధించిన అతి పెద్ద విజయం.. పుష్ప. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.300 కోట్లు సాధించినందని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. ఈరోజుల్లో సినిమా రూ.300 కోట్లు సాధించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే... దేశ వ్యాప్తంగా థియేటర్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఏపీలో టికెట్ రేట్లు చాలా తక్కువ. చాలా రాష్ట్రాల్లో థియేటర్లు అందుబాటులో లేవు. పైగా.. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో కూడా.. రూ.300 కోట్లు సాధించిందంటే గొప్పే. అన్నింటికంటే ముఖ్యంగా తొలి రోజు ఈసినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినా సరే, నిలదొక్కుకుని భారీ వసూళ్లు అందుకుంది. ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో విడుదల అవుతోంది.
జనవరి 7 నుంచి అమేజాన్ ప్రైమ్ లో ఈసినిమాని చూడొచ్చు. అమేజాన్ వాళ్లు ఈ సినిమాకి ఏకంగా పాతిక కోట్లు ఇచ్చార్ట. థియేటర్లో విడుదలైన మూడు వారాలకే.. పుష్ప ఓటీటీలోకి రావడం విశేషం. అతి తక్కువ రోజుల్లో ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయడం వల్ల మంచి రేటు గిట్టుబాటు అయ్యింది. అన్ని భాషల్లోనూ ఈసినిమా అందుబాటులో ఉంటుంది. హిందీలో తప్ప. హిందీ వెర్షన్ ని కాస్త లేటుగా అప్ లోడ్ చేయనుంది అమేజాన్. ఎందుకంటే.. ఈ సినిమా వసూళ్లు బాలీవుడ్ లో ఇప్పటికీ నిలకడగా కొనసాగుతున్నాయి. అందుకే నిర్మాతల విన్నపం మేరకు... కాస్త ఆలస్యంగా హిందీ వెర్షన్ ని విడుదల చేయబోతున్నారు.