తగ్గేదే.. లే - అంటూ `పుష్ష`లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. దానికి తగ్గట్టుగానే `పుష్ష` కూడా ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఈ సినిమా టీజర్ సూపర్ హిట్. రెండు పాటలొస్తే రెండూ... ప్రేక్షకులకి బాగా నచ్చేశాయి. అయితే... తొలిసారి పుష్ష `తగ్గాల్సిన` తరుణం వచ్చిందట.
వివరాల్లోకి వెళ్తే... పుష్షని అక్టోబరు 13న విడుదల చేద్దామనుకున్నారు. కుదర్లేదు. ఇప్పుడు డిసెంబరు 17న రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. డిసెంబరు 17న ఈ సినిమా వస్తుందని అభిమానులంతా గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమన్నది ట్రేడ్ వర్గాల టాక్.
ఎందుకంటే.. పుష్ష షూటింగ్ ఇంకా అవ్వలేదు. మరో షెడ్యూల్ మిగిలే ఉంది. అందుకోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేకమైన సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. అక్కడ కనీసం 15 రోజుల షెడ్యూల్ ఉంది. సుకుమార్ ని మిస్టర్ పర్ ఫెక్ట్ అని పిలుస్తారంతా. తను 15 రోజుల షెడ్యూల్ వేశాడంటే.. కనీసం మరో 5 రోజులైనా పెరగడం ఖాయం. అంటే 20 రోజుల షూటింగ్ అన్నమాట. ఆ తరవాత.. పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రచారానికీ టైమ్ కేటాయించాలి. ఇదంతా డిసెంబరులోగా జరిగిపోవాలి. షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఓకే. లేదంటే మాత్రం... చాలా కష్టం. ఒకవేళ డిసెంబరు 17 దాటితే, డిసెంబరు 24న రావాలి. అది కూడా తప్పితే... ఇక వేసవి వరకూ.. ఈ సినిమా విడుదల అవ్వడం కష్టం. ఎందుకంటే.. ఇప్పటికే సంక్రాంతి బెర్తులు నిండిపోయాయి. ఫిబ్రవరి సినిమాలకు సంబంధించి బ్యాడ్ సీజన్. ఆ తరవాత వేసవి వరకూ పడిగాపులు కాయక తప్పదు.