చిత్రసీమ అంటేనే కపట నాటకాలు. మోసాలకు కొదవ ఉండదు. సినిమా అవకాశాల పేరు చెప్పి, నయ వంచన చేయడానికి వలలు విసురుతుంటారు. దానికి అమాయకులు బలైపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ప్రభాస్ పేరుతో ఓ హీరోయిన్‌కి వలేశారు. ముంబై పిలిపించారు. ఇప్పుడు ఆ హీరోయిన్ మిస్సవ్వడం టాలీవుడ్ లో కలకలాన్ని రేకెత్తిస్తోంది.
ఇటీవల విడుదలైన రాహు అనే చిత్రంలో కథానాయికగా నటించింది క్రితి ఈ వలలో చిక్కుకుంది. తనకు ఈమధ్య ఓ ఫోన్ వచ్చింది. తాను సందీప్ రెడ్డి వంగా అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి... ప్రభాస్ సినిమాలో నీకు అవకాశం ఇప్పిస్తానని, కృతిని ముంబై పిలిపించాడు. ఆ మాటలు నమ్మి కృతి ముంబై వెళ్లింది. అయితే అక్కడ ఏమైందో తెలీదు గానీ, ఆ అమ్మాయి మిస్సయ్యింది. ఆఖరికి ఫోన్ నెంబర్‌కూడా కలవడం లేదు. దాంతో కుటుంబ సభ్యులు కంగారుతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సివచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం మిస్సింగ్ కేసు నమోదయ్యింది. పోలీసులు క్రితి కాల్ లిస్టు డేటాని పరిశీలిస్తున్నారు. ముంబై పోలీసులతోనూ సంప్రదింపులు జరుగుతున్నారు. ఎవరైనా అవకాశాలు ఇస్తామని ఫోన్లు చేసి, రమ్మంటే.. అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.