కథానాయికలకు హీరోల్లా ఫైట్లు చేయాలని, యాక్షన్ స్టార్స్ అనిపించుకోవాలని తెగ ఇదిగా ఉంటుంది. అయితే బరిలోకి దిగితే గానీ, అందులో అసలు `మజా` అర్థం కాదు. యాక్షన్ చేయడం అంత ఈజీ కాదనే సంగతి.. అనుభవంలోకి వస్తే తప్ప అవగతం అవ్వదు. లక్ష్మీరాయ్ కూడా దాన్ని అనుభవ పూర్వకంగానే తెలుసుకుంది. తనకెప్పటి నుంచో..యాక్షన్ సినిమా చేయాలని తెగ ఆరాటం. ఇటీవల ఓ సినిమా కూడా ఒప్పుకుంది. అయితే ఆ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండగా లక్ష్మీరాయ్‌కి గాయమైంది. దాంతో.. షూటింగ్ కి పేకప్ చెప్పేసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు లక్ష్మీరాయ్‌కి బాగానే ఉంది. మళ్లీ షూటింగుల్లో పాల్గొంటోంది. ``యాక్షన్ సన్నివేశాల్లో నటించడం అంటే మాటలు కాదు. అది నాకిప్పుడు తెలిసొచ్చింది. ఏదేమైనా సినిమా కోసమే కదా.. ఇష్టమైన పాత్రల కోసం సాహసాలు చేయాలి.. త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటాను`` అని ముక్తాయించింది ఈ సొగసరి.