ముద్దుగుమ్మ రాశీఖన్నా రెమ్యునరేషన్ బాగా పెంచేసిందట. అవును మరి, దీపమున్నప్పుడే కదా హీరోయిన్లు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది సినిమా ఎరిగిన సత్యమే. అందుకే డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు అందాల భామలు. ఆ దిశగా ఇప్పుడు ముద్దుగుమ్మ రాశీఖన్నాకి డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో ఈ ఏడాది హిట్ కొట్టిన భామల్లో అందాల భామ రాశీఖన్నాదే టాప్ ప్లేస్ అని చెప్పాలి.
ఈ ఏడాది 'టచ్ చేసి చూడు', 'తొలి ప్రేమ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశీఖన్నాకి 'టచ్ చేసి చూడు' నిరాశపరిచింది. ఇకపోతే 'తొలిప్రేమ' విషయానికి వస్తే, ఈ సినిమా వసూళ్ల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. అలాగే హీరోతో సమానంగా హీరోయిన్ రాశీఖన్నా క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు ఈ సినిమాలో. సో హీరో వరుణ్ తేజ్‌తో సమానంగా రాశీఖన్నాకి నటనలో మంచి మార్కులు పడుతున్నాయి. సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. దాంతో రాశీఖన్నా రేంజ్ పెరిగిపోయింది. అందులోనూ ఈ ముద్దుగుమ్మ మరో పక్క తమిళంలో ఫుల్ బిజీగా ఉంది కూడా. దాంతో టాలీవుడ్‌లో తదుపరి చిత్రాలకు రెమ్యునరేషన్ బాగా పెంచేసిందంటూ గాసిప్స్ వస్తున్నాయి.
ఇక తెలుగులో రాశీఖన్నా చేయబోయే చిత్రాలు ఏంటయ్యా అంటే, యంగ్ హీరో నితిన్‌తో ఓ సినిమాకి రాశీ కమిట్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న 'చల్ మోహనరంగా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మేఘాఆకాష్ హీరోయిన్ కాగా, నితిన్ నటిస్తున్న మరో చిత్రం 'శతమానం భవతి'తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాలోనే రాశీఖన్నాని హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ తెలియవస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే కాక 'తొలిప్రేమ' హిట్‌తో మరిన్ని క్రేజీ ఆఫర్స్ రాశీని వెతుక్కుంటూ వస్తున్నాయట.