'బెల్లం శ్రీదేవి' అంటూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన చిలిపి పోలీసాఫీసర్‌గా కనిపించి మంచి హిట్ కొట్టేసింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. 'సుప్రీమ్' తర్వాత రాశీఖన్నా - సాయి ధరమ్ జంటగా వస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. డిశంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాశీఖన్నా పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండనుందట. టిక్‌టాక్ ఏంజిలా పాత్రలో రాశీఖన్నా నటించనుంది ఈ సినిమాలో. ముఖ్యంగా ఏంజిలా చేసే టిక్ టాక్ వీడియోస్ నుండి పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందట.
కథ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన రెండు ఆడియో సింగిల్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. అయితే లవ్ స్టోరీస్, లేదంటే థ్రిల్లర్స్, అవీ ఇవీ కాకుంటే, అడల్ట్ కంటెంట్ మూవీస్ ఎక్కువగా హల్‌చల్ చేస్తున్న ఈ తరుణంలో మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ప్రతిరోజూ పండగే' మూవీ కాస్త భిన్నంగా ఉండబోతోందట. ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్నట్లు తాత మనవడు కథ కాదట ఇది. కొడుక్కి తండ్రి వేల్యూ తెలియజెప్పే కథట. అయితే, సీరియస్ మూడ్‌లో కాకుండా ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ సినిమాని మలిచారట.
'భలే భలే మగాడివోయ్' సినిమా తర్వాత మారుతి ఒకే ట్రెండ్‌కి స్టిక్ ఆన్ అయిపోయాడు. హీరోకి డిజార్డర్ పెట్టి, ఆ డిజార్డర్ నుండి కామెడీ పుట్టించి పండగ చేసుకున్నాడు. అయితే, ఆ ట్రెండ్‌కి ఆడియన్స్ విసిగిపోయారు. దాంతో మారుతి కూడా ట్రాక్ మార్చేశాడు. ఈ సినిమాలో హీరోకి ఎలాంటి డిఫెక్ట్ ఉండదని ముందే తేల్చేశారు. కానీ, కథా బలంపై చాలా గొప్పగా చర్చ జరుగుతోంది. ఆ బలాబలాలేంటో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.