ఎన్నో అంచనాల మధ్య `రాధే శ్యామ్` విడుదలైంది. రూ.300 కోట్ల సినిమా ఇది. తొలి రోజు డివైడ్ టాక్ వినిపించింది. కొందరు అంచనాల్ని అందుకోలేదని అంటుంటే, ఇంకొందరు... ఇది క్లాసిక్‌లా ఉంది, షేక్‌ష్పియర్ ప్రేమ కావ్యంలా కనిపిస్తోంది అంటున్నారు. కథ కాస్త వీక్ అన్నమాట నిజం. ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలు ఈ సినిమాలో లేవన్న మాట నిజం. అయితే... సినిమా మాత్రం విజువల్ వండర్ లా కనిపించింది. ఈ సినిమా లుక్ గురించి, ఇందులో సెట్స్ గురించి విశ్లేషకులు, సినీ అభిమానులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ క్రెడిట్ అంతా... ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ కే దక్కుతుంది.
మగధీర, ఈగ, మర్యాద రామన్న, భాగ్‌మతి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు భారీ సెట్స్ వేశారు రవీందర్ రెడ్డి. ఆ సినిమాల్లో రవీందర్ పనితనం మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు... రాధే శ్యామ్ మరో ఎత్తు అయిపోయింది. ఈ సినిమా కోసం 101 సెట్లు వేశారు రవీందర్. ఇటలీలో లైవ్ లొకేషన్లలో కొన్ని సీన్లు తీశారు. వాటికి మ్యాచింగ్ సీన్లు హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో చేశారు. అయితే విచిత్రం ఏమిటంటే... ఏది లైవ్ లొకేషనో, ఏది సెట్లో ఎవరికీ అర్థం కాలేదు. అంత సహజంగా అనిపించాయి. ఆ కలర్ టోన్, యూరోపియన్ కల్చర్‌ని తెరపై చూపించిన విధానం... ఇవన్నీ ఆకట్టుకున్నాయి. సినిమాని కొత్త టోన్‌లో చూపించాయి. చిన్న చిన్న ప్రోపర్టీస్ విషయంలో కూడా రవీందర్ ఏమాత్రం ఆశ్రద్ధ చేయలేదు. వాటిలోనూ ప్రత్యేకత చూపించారు. ఆఖరికి.. పూజా హెగ్డే పెట్టుకునే `పిన్`ని సైతం కథలోకి లాక్కొచ్చి.. దానికో కొత్త కలర్ ఇచ్చారు. అలా.. ఈ సినిమా విజువల్ గా ఇంత బాగా రావడంలో రవీందర్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆర్ట్ విభాగంలో మాత్రం అవార్డులు రావడం ఖాయమన్నది విశ్లేషకుల మాట.