2022 తొలి రోజు... సినీ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్.ఆర్.ఆర్.. వాయిదా పడబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దేశమంతా థర్డ్ వేవ్ ప్రకంపనాలు మొదలైపోయాయి. చాలా రాష్ట్రాలలో థియేటర్లుబంద్ చేశారు. కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్‌ఫ్యూ నిబంధన విధించారు. తమిళ నాట కూడా థియేటర్లు మూతబడుతున్నాయి.
ఈ నేథప్యంలో ఆర్.ఆర్.ఆర్‌ని వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదని చిత్రబృందం భావిస్తోంది. అందుకే పరిస్థితి సద్దుమణిగేంత వరకూ ఆర్.ఆర్.ఆర్ ని విడుదల చేయకూడదని భావిస్తోందట. ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడితే వచ్చేది 2022 వేసవికే. ఆర్.ఆర్.ఆర్ వస్తుందని భయపడి కొన్ని సినిమాలు ఈ సంక్రాంతికి రాకుండా వెనక్కి వెళ్లిపోయాయి. వాటిలో ఒకట్రెండు ఈ సారి రావొచ్చు. బంగార్రాజు.. ఈనెల 15న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాధేశ్యామ్ అయినా వస్తుందా? రాదా? అనేది అనుమానంగా మారింది. రాధే శ్యామ్ కూడా రాకపోతే... ఈ సంక్రాంతి శోభ పూర్తిగా పోయినట్టే.