ఎప్పటి నుంచో.. సెట్స్‌పై ఉన్న ప్రభాస్ సినిమా `రాధే శ్యామ్`. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు. దాదాపుగా ఈ సినిమా మేకింగ్ కోసం రెండున్నరేళ్ల సమయం తీసుకున్నారు. ఇప్పటికీ పూర్తి కాలేదు. లాక్ డౌన్ వల్ల.. ఈ సినిమా మరింత ఆలస్యమైంది. ఎలాగైనా సరే, ఈ దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. అయితే ఈలోగా ఓటీటీ సంస్థల నుంచి ఈ చిత్రానికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అమేజాన్ ప్రైమ్ ఏకంగా 400 కోట్లతో ఓ ప్రతిపాదన తెచ్చిందని సమాచారం. దాని ప్రకారం.. `రాధే శ్యామ్`కి సంబంధించిన అన్ని హక్కుల్నీ అమేజాన్ కి కట్టబెట్టాల్సి ఉంటుంది.
నిజంగా ఇది మంచి ఆఫరే. ఎందుకంటే... ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే వంద కోట్ల లాభం.. ఎలాంటి రిస్కూ లేకుండా వచ్చేస్తోంది. పైగా రాధే శ్యామ్ చాలా లేట్ అయిన ప్రాజెక్టు. అలా లేట్ అయిన కొద్దీ.. సినిమాపై నమ్మకాలు సడలిపోతాయి. అలా.. రాధే శ్యామ్ పై అంచనాలు తగ్గాయి. కరోనా నేపథ్యంలో థియేటర్లు తెరచినా, జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. సినిమా బాహుబలిని మించిపోతే గానీ, ఈ 400 కోట్లు రావు. అంత రిస్క్ ఎందుకులే అనుకుంటే.. అమేజాన్‌కి అమ్ముకోవడం మంచి మార్గం.
మరి ఈ 400 కోట్లు.. అమేజాన్ రాబట్టగలదా? అనేదే పెద్ద ప్రశ్న. పే ఫర్ వ్యూ పద్ధతిన ఈ సినిమాని విడుదల చేసి టికెట్ రేటు 300 గా నిర్ణయిస్తే.. కనీసం కోటిమంది ఈ సినిమా చూడాలి. అలా చూస్తే గనుక... సక్సెస్ అయినట్టే. ఆ ఆశతోనే.. అమేజాన్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.