ఈరోజుల్లో బడా స్టార్ తో సినిమా అంటే రూ.100, రూ.200 కోట్ల పైమాటే. ప్రభాస్ తో సినిమా అంటే రూ.300 కోట్లు తగ్గడం లేదు. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాబట్టుకునే స్టామినా ఉంది కాబట్టి, ప్రభాస్ పై ఎంత పెట్టుబడి పెట్టడానికైనా వెనుకంజ వేయడం లేదు నిర్మాతలు. తాజాగా రాధేశ్యామ్ బడ్జెట్ కూడా పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాకి రూ.300 కోట్లు ఖర్చయ్యాయని నిర్మాతలే చెబుతున్నారు. కేవలం సెట్స్ కోసమే రూ.75 కోట్లు కేటాయించార్ట.
ఇది ఇటలీ నేపథ్యంలో సాగే కథ. పైగా వింటేజ్ లుక్‌లో ఉండాలి. ఇటలీలో కొంతమేర షూటింగ్ చేశారు. ఆ తరవాత కరోనా వచ్చింది. అందుకే హైదరాబాద్ లో సెట్స్ వేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్లు వేశారు ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్. ఆ సెట్ల విలువ ఏకంగా రూ.75 కోట్లు. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ చాలా కీలకం. ఆ సెట్.. హైదరాబాద్ లోనే వేశారు. క్లైమాక్స్ లో ఓడ ఎపిసోడ్ కూడా.. చాలా ముఖ్యం. అది రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్. రాధే శ్యామ్ కోసం ఓ కాఫీ షాప్ సెట్, చాపర్, హీరోయిన్ ఇల్లు, ఆస్పటల్.. ఇలా అనేక సెట్లు వేశారు. అవన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో కనిపించబోతున్నాయని టాక్. అందుకే అంత ఖర్చయ్యిందట. మరి ఈ ఖర్చు థియేటర్లో ఎలా కనిపిస్తుందో చూడాలి.