ఏ ముహూర్తాన రాధే శ్యామ్ మొదలు పెట్టారో గానీ, ముందు నుంచీ అన్నీ అవాంతరాలే. సినిమా షూటింగు ఆగిపోవడం, రీషూట్లు జరగడం, కరోనా బాధలు, విడుదల వాయిదా పడడం.. ఇలా ఒకటి కాదు. అన్నీ ఇబ్బందులే. జులై 30న ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. పది రోజుల షూటింగే బాకీ కాబట్టి... కరోనా ఇబ్బందులు ఉన్నా, అనుకున్న సమయానికి సినిమా వచ్చేస్తుందనుకున్నారంతా.
అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా మారబోతోంది. జులై 30న ఈ సినిమా రావడం లేదు. అక్టోబరుకి షిఫ్ట్ అయ్యింది. అది కూడా... కరోనా ప్రభావం తగ్గి, షూటింగులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడితేనే. జూన్, జులైలలో కరోనా ఉధృతి ఇంకా బీభత్సంగా ఉంటుందన్న వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే ఈ యేడాదికి రాధే శ్యామ్ ని మర్చిపోవొచ్చు. ఇదొక్కటే కాదు. ఈ యేడాది విడుదల కావల్సిన పెద్ద సినిమాలన్నీ 2022కి షిఫ్ట్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు చక్కబడితే, రాధే శ్యామ్ దసరా బరిలో నిలుస్తుంది.