మహేష్ బాబుకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాస్ పీకారు. 'కథ చెప్పేటప్పుడు ఇలా వినాలి....' అంటూ హితోపదేశం చేశారు. అయితే ఇది ఇప్పటి సంగతి కాదు. `రాజకుమారుడు` నాటి మాట. బాల నటుడిగా మెప్పించిన మహేష్.. 'రాజకుమారుడు'తో హీరో అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకుడు. మహేష్‌కి కథ చెప్పడానికి పరుచూరి బ్రదర్స్‌ని వెంటబెట్టుకుని వెళ్లారట రాఘవేంద్రరావు. ఆఫీసు రూమ్‌లో మహేష్‌ని కూర్చోబెట్టుకుని పరుచూరి సోదరులు కథ చెబుతుంటే తొలి పది నిమిషాలూ ఓపిగ్గా విన్న మహేష్, ఆ తరవాత టేబుల్‌పై ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఆడుకోవడం మొదలెట్టాడట.
కథ పూర్తయినంత వరకూ మహేష్ ఆ రబ్బరు బ్యాండుతోనే ఆడుతూ కూర్చున్నాడట. కథ చెప్పేసిన తరవాత పరుచూరి సోదరులు వెళ్లిపోయార్ట. ఆ తరవాత.. రాఘవేంద్రరావు మహేష్‌ని పిలిచి.. `కథ చెబుతున్నప్పుడు ఓపిగ్గా వినాలి. కథ నచ్చకపోయినా... నచ్చినట్టు ప్రవర్తించాలి.. లేదంటే కథ చెప్పేవాళ్లలో కాన్ఫిడెన్స్ పడిపోతుంది` అన్నార్ట. అప్పటి నుంచీ తాను ఆ తప్పు చేయలేదని మహేష్ చెబుతున్నాడు. మహేష్ 25వ సినిమా `మహర్షి` త్వరలో విడుదల అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా మహేష్ ఈ పాత విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు.