ఓం నమో వేంకటేశాయ రాఘవేంద్రరావు చివరి చిత్రమా?? ఈ సినిమా తరవాత దర్శకేంద్రుడు రిటైర్మెంట్ తీసుకొంటారా?? గత కొన్ని రోజులుగా ఈ చర్చ టాలీవుడ్ అంతా నడుస్తూనే ఉంది. ఓం నమో వేంకటేశాయ ఆడియో ఫంక్షన్లో నాగార్జున మాటలు ఈ గాసిప్ కి మరింత బలం చేకూర్చింది. ''బహుశా.... ఆయన చివరి సినిమా ఇదే కావొచ్చు'' అంటూ నాగ్ కూడా దర్శకేంద్రుడి అస్త్ర సన్యాసం విషయాన్ని చూచాయిగా చెప్పేశారు. దాంతో రాఘవేంద్రరావు నుంచి ఇక సినిమాలు రావేమో అనుకొన్నారంతా. కానీ.. రిటైర్మెంట్ ఆలోచన లేదని దర్శకేంద్రుడి మాటల్ని బట్టి అర్థం అవుతోంది. ''చివరి సినిమా అని నాగార్జున అన్నాడు. అది భక్తి చిత్రాలకు మాత్రమే'' అంటూ దర్శకేంద్రుడు క్లారిటీ ఇచ్చేశాడు. పైగా 'రావణ' చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని, అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తేల్చేశాడు దర్శకేంద్రుడు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రావణ ప్రాజెక్టు తెరకెక్కించాలని ఎప్పటి నుంచో మంచు విష్ణు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. సో.. ఆ సినిమా త్వరలోనే ఉండబోతోందన్నమాట.