సంగీతంతో స‌మ‌రం: క‌రోనాపై కొత్త పాట‌లెన్నో

By Gowthami - April 05, 2020 - 15:29 PM IST

మరిన్ని వార్తలు

సామాజిక చైత‌న్యం కూడా క‌ళల ప్రాధ‌మిక బాధ్య‌త‌. నిజానికి క‌ళ‌లు పుట్టిందే అందుకు. స‌మాజాన్ని ప‌ట్టిపీడించే అనేక దురాగ‌తాల్నీ, దుర‌ల‌వాట్ల‌నీ పాల‌ద్రోల‌డానికి క‌ళాకారులు ముందుకొచ్చేది అందుకే. క‌రోనాపై పోరాటం పోరాటం చేస్తున్న స‌మ‌యంలో మ‌రోసారి క‌ళాకారులు త‌మ సామాజిక బాధ్య‌త‌ని గుర్తించారు. పాట‌లు, క‌విత్వాలు, వ్యాసాల‌తో.. చైత‌న్యం నింపుతున్నారు. జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు.

 

ఈ విష‌యంలో టాలీవుడ్ ముందే ఉంది. క‌రోనా కాటేస్తున్న ఈ కాలంలో... సినిమావాళ్లు తెలుగు ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింప‌డానికి, అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంగీత కారులు పాట‌ల‌తో కొత్త ఉత్తేజాన్ని ఇవ్వ‌డానికి క‌దం క‌లుపుతున్నారు. క‌రోనాపై తెలుగులో వ‌చ్చిన పాట‌లు ఇంకెక్క‌డా రాలేదేమో..? కోటి సంగీత సార‌ధ్యంలో ఓ పాట రూపొందించ‌డం, అందులో చిరు, నాగార్జున‌, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌డం తెలిసిన విష‌యాలే.

 

ఈ పాట ప్ర‌ధాని దృష్టి వ‌ర‌కూ వెళ్లింది. ఆయ‌న ఈ కృషిని అభినందించారు కూడా. `చేతులెత్తి మొక్కుతా..` అంటూ చౌర‌స్తా టీమ్ క‌రోనాపై ఓ మంచి పాట చేసింది. ఇప్పుడు అది వైర‌ల్ అయ్యింది కూడా. `స్టూడెంట్ నెంబ‌ర్ 1`లోని సూప‌ర్ హిట్ గీతం `ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి`ని పేర‌డీ చేస్తూ కీర‌వాణి పాడిన ఓ పాట కూడా హృద‌యాల్ని హ‌త్తుకుంది. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌`లోని `అరెరె.. అరెరె` పాట‌ని వ‌న‌మాలి పేర‌డీ చేస్తూ.. దాన్ని క‌రోనాపైచైత‌న్యం క‌లిగించేందుకు ఉప‌యోగించుకున్నారు. చంద్ర‌బోస్‌, శ్రీ‌మ‌ణి, అనంత శ్రీ‌రామ్ లాంటి గీత ర‌చ‌యిత‌లు ఇప్ప‌టికే క‌రోనాపై గీతాలు రాసేశారు. తాజాగా సిరాశ్రీ నుంచి ఓ మంచి పాట వ‌చ్చింది. ఈ పాట‌ని ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌రిచి ఆల‌పించారు.

 

క‌రోనాపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని చెబుతూనే, తీసుకోక‌పోతే వ‌చ్చే న‌ష్టాల్ని కాస్త ఘాటుగా చెప్పిన పాట ఇది. పాడిన విధానం బాగుండ‌డం, మాస్‌కి న‌చ్చేలా ఈ పాట‌ని కంపోజ్ చేయ‌డంతో త్వ‌ర‌గానే ఈ పాట పాపుల‌ర్ అయిపోయింది. ఇలా మొత్తానికి మ‌న సంగీత ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లూ స‌మాజిక చైత‌న్యం నింప‌డానికి త‌మ‌దైన శైలిలో పాటు ప‌డుతున్నారు. వాళ్లంద‌రి కృషికీ వీర‌తాళ్లు వేయాల్సిన స‌మ‌య‌మిది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS