రాజ్ కుంద్రా వ్యవహారం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఏ ఇద్దరి నోట విన్నా... ఈ వార్తలే. నీలి చిత్రాల వ్యవహారంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడం, తనకు సోమవారం ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే... రాజ్ కుంద్రాపై పోలీసులు నమోదు చేసిన చార్జ్ షీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. రాజ్ కుంద్రా సెల్ ఫోన్ లో.. 119 నీలి చిత్రాలు ఉన్నాయని, వాటిని రాజ్ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్టు తాము సాక్షాధారాల్ని సేకరించామని ముంబై పోలీసులు చెబుతున్నారు.
ఈయేడాది ఫిబ్రవరిలో ముంబై సమీపంలోని `మాల్ దీవి` అనే ప్రాంతంలోని ఓ బంగ్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి.. అక్కడ నీలి చిత్రాలు తీస్తున్న ముఠాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్లని విచారిస్తే రాజ్ కుంద్రా పేరు బయట పడింది. అనంతరం రాజ్ కుంద్రా నివాసం, కార్యాలయాలపై పోలీసులు దాడి చేసి, పెద్ద ఎత్తున నీలి చిత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజ్‌కుంద్రాని అరెస్ట్ చేశారు. ఈ కేసులోంచి కుంద్రా బయటపడడం దాదాపు అసాధ్యమని ముంబై వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.