ప్రముఖ యంగ్ హీరో రాజ్‌తరుణ్ తండ్రికి మూడేళ్లు జైలు శిక్ష పడింది.
బ్యాంకులో నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టిన నేపథ్యంలో 2013లో ఆయనపై కేసు నమోదైంది. విశాఖపట్నంలోని ఓ బ్యాంకులో ఆయన క్యాషీయర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. 2013లో ఆయన భార్య రాజ్యలక్ష్మి సహా మరో ముగ్గురు సన్నిహితులు పేర్ల మీద నకిలీ బంగారం తాకట్టు పెట్టి సుమారు 9.85 లక్షల రూపాయల వరకూ రుణం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాంకు అధికారులు ఆడిట్ తనిఖీలు చేయడంతో నకిలీ బంగారు నగలు బయటపడ్డాయి.
వివరాలు సేకరిస్తే, రాజ్ తరుణ్ తండ్రి అయిన నిడమర్తి బసవరాజుది తప్పుగా తేలింది. దాంతో ఆ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ కేసు తుది తీర్పు తాజగా వెల్లడైంది. బసవరాజును దోషిగా తేల్చుతూ, మూడేళ్ల జైలుశిక్షను, 20వేల రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
'ఉయ్యాలా జంపాలా' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాజ్‌తరుణ్ వరుస హిట్స్‌తో కొద్ది కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు రాజ్‌తరుణ్ కెరీర్ కొంచెం వేగం తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం రాజ్‌తరుణ్ నటిస్తున్న 'రాజుగాడు' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్ సరసన అమైరాదస్తూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.