'ఒరేయ్ బుజ్జీ..' అంటూ సరదాగా పిలుచుకుంటుంటారు స్నేహితులు,సన్నిహితులు. 'అతడు'లో బుజ్జి క్యారెక్టర్ కూడా బాగా పండింది. తనికెళ్ల భరణి.. ఎప్పుడు బుజ్జీ... బుజ్జీ అని పిలుస్తుంటాడు. ఇప్పుడే ఇదే సినిమా టైటిల్ అయిపోయింది. రాజ్ తరుణ్ కథానాయకుడిగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి 'ఒరేయ్ బుజ్జిగా' అనే టైటిల్ ఫిక్సయ్యింది. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం చిత్రాల తరవాత కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
మాళవిక నాయర్‌ని కథానాయికగా ఎంచుకున్నారు. మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ తరుణ్‌కి హిట్లు లేవు. తొలి సినిమాతో హిట్టు కొట్టిన విజయ్ కుమార్ కొండా రెండో సినిమాకి బోల్తా పడ్డాడు. వీరిద్దరూ నిరూపించుకోవాల్సిన తరుణం ఇది. అందుకే ఆశలన్నీ బుజ్జిగాడిపైనే పెట్టుకున్నారు. మరి వీరిద్దరి భవిష్యత్తు ఏమవుతోందో? బుజ్జి ఏం చేస్తాడో?