రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు. తన కెరీర్‌లో ది బెస్ట్ సినిమా ఇస్తాడని అందరి నమ్మకం. దాన్ని రాజమౌళి కూడా నిలబెట్టుకుంటూ వచ్చాడు. కానీ ఒకటే సమస్య. రాజమౌళి సినిమా అంటే రెండు మూడేళ్లు లాక్ అయిపోవాల్సిందే. అది తప్ప మరో సినిమా ఒప్పుకోలేం. `ఆర్.ఆర్.ఆర్` ఒప్పుకుని ఎన్టీఆర్ కూడా అలానే లాక్ అయిపోయాడు. ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు చాలా ఉన్నాయి. కానీ.. `ఆర్.ఆర్.ఆర్` పూర్తయితే గానీ చేయలేడు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎప్పుడో ఓ కథ సిద్ధం చేసేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ పాటికి సెట్స్‌పై ఉండేది. కానీ.. కరోనా వల్ల `ఆర్.ఆర్.ఆర్` ఆలస్యం అయ్యింది. దాని వల్ల త్రివిక్రమ్ సినిమా కూడా వెనక్కి వెళ్లింది. `ఆర్.ఆర్.ఆర్` పూర్తయితే గానీ, త్రివిక్రమ్ తో సినిమా మొదలెట్టలేడు. అందుకే త్రివిక్రమ్ కూడా ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నాడు. అయితే.. ఇప్పుడు ఆ బెంగ తీరింది. రాజమౌళి ఎన్టీఆర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. `కావాలంటే ఈలోగా మరో ప్రాజెక్టు కూడా చేసుకో` అన్నాడట. దాంతో.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకున్న ఓ అడ్డు తొలగినట్టైంది. `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ తో సంబంధం లేకుండా. త్రివిక్రమ్ సినిమాని సెట్స్‌పై తీసుకెళ్లొచ్చు. కానీ.. ఈ రెండు సినిమాల గెటప్పులు వేరు. అందుకే ముందు ఎన్టీఆర్ పార్ట్ అంతా తీసేసి, అప్పుడు మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ మొదలెడతాడట జక్కన్న. `ఆర్.ఆర్.ఆర్` మొదలైన రెండు నెలలకే ఎన్టీఆర్ షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమా మొదలెట్టొచ్చు. అదీ.. ఎన్టీఆర్ ప్లానింగ్.