రాజధాని అమరావతికి సంబంధించి, దేశం కీర్తించిన డైరెక్టర్ రాజమౌళి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకోసం రాజమౌళిని తమ వద్దకు పిలిపించారు చంద్రబాబు. ఈ రోజు రాజమౌళి - చంద్రబాబును కలిశారు. నార్మల్ ఫోస్టర్స్ అనే లండన్‌కి చెందిన కంపెనీ రాజధాని కోసం కొన్ని ప్రత్యేక డిజైన్లను రూపొందించింది. వాటిలో కొన్ని ఫ్రంట్ డిజైన్స్ పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఆ డిజైన్స్‌ని రాజమౌళికి చూపించి వాటిని మన సంస్కృతీ సాంప్రదాయాలకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయమని ఆదేశించారు. అందుకు రాజమౌళి సానుకూలంగా స్పందించారు. ఈ డిజైన్స్ నేపథ్యంలో చంద్రబాబు త్వరలోనే లండన్ వెళ్లనున్నారు. అప్పుడు తనతో పాటు రాజమౌళిని కూడా తీసుకెళ్లనున్నారు. 'మగధీర' కోసం 'ఉదయ్‌ఘడ్' సామ్రాజ్యాన్ని, 'బాహుబలి' కోసం 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని సెట్స్‌గా వేయించారు రాజమౌళి. ఆ సెట్స్ ఎప్పటికీ ప్రత్యేకమైనవే. తెలుగు సినీ పరిశ్రమలో న భూతో న భవిష్యతి అనే స్థాయిలో వేసిన సెట్స్ అవి. వాటిని చూసి, మెచ్చిన చంద్రబాబు ఆ రకంగా నూతన రాజధాని నిర్మాణాలు వుండాలని కోరుకున్నారు. ఆయన కోరిక ప్రకారం రాజధాని నిర్మాణంలో రాజమౌళికి తన సలహాలనందించే అరుదైన అవకాశాన్ని అందించారు. రాజమౌళి సూచనల మేరకు అమరావతి ఎంత అద్భుతమైన మెరుగులు దిద్దుకోనుందో చూడాలిక.