దేశం గర్వించదగ్గ సినిమా 'బాహుబలి'. అలాంటి గొప్ప సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల కీర్తించదగ్గట్లుగా చేసిన డైరెక్టర్ రాజమౌళికి ఏఎన్నార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి గొప్పతనాన్ని వెంకయ్యనాయుడు, కేసీఆర్ కొనియాడారు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి మరెన్నో సినిమాలు రాజమౌళి తెరకెక్కించాలని వెంకయ్యనాయుడు అన్నారు. అవార్డు అందుకున్న తర్వాత రాజమౌళి 'నేను ఈ అవార్డు అందుకోవడానికి అనర్హున్ని.. ఈ అవార్డు దక్కడంతో నాలో భయం పెరిగింది. ఇంకా బాధ్యతాయుతంగా సినిమాలు తీయాల్సి ఉంటుంది' అని ఆయన అన్నారు. అయితే రాజమౌళికి ఇంత గొప్ప అవార్డు ఇవ్వడమేంటి, అంతకన్నా గొప్ప డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఈయన తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాలేదా?' అని సోషల్ మీడియాలో వాడి వేడిగా చర్చలు జరుగుతూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. బహుశా ఈ మెసేజ్‌లు రాజమౌళి దృష్టికి వెళ్లి ఉండవచ్చు. అందుకే ఆయన ఆ రకంగా మాట్లాడి ఉండవచ్చునేమో. ఏది ఏమైనా ఇక్కడ రాజమౌళి ఘనతని మెచ్చుకుని తీరాలి. తెలుగు సినిమా మార్కెట్‌ని ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఆయన. ఎవరవునన్నా, కాదన్నా, అలాంటి గొప్ప డైరెక్టర్‌కి ఈ అవార్డు దక్కడం అర్హత కలిగిన విషయమే.ఈ విషయాన్నే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్థావించారు.